మారటోరియం కేసులో విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఆర్‌బీఐకు వడ్డీలు మళ్లీ లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్, సర్య్కూలర్ల జారీ వంటి అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్రం కేబినెట్ నోట్‌ను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించి ఆమోదం తీసుకొంది. ప్రభుత్వ అఫిడవిట్‌లో సమగ్ర సమాచారం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రియల్ ఎస్టేట్, బిల్డర్లను పట్టించుకోలేదన్న విషయాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం చిన్న రుణ గ్రహీతల నుంచి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేయడానికి సిద్ధమైన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఇందుకుగాను ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా. చక్రవడ్డీ మాఫీకి సంబంధించిన క్లెయిమ్‌ల వివరాలను బ్యాంకులు కేంద్రానికి సమర్పిస్తే.. ప్రభుత్వం నగదును ఖాతాలకు బదిలీ చేయనుంది. దీనిలో వడ్డీని లెక్కించిన విధానాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మాఫీ లబ్ధిని అందిస్తారు. మార్చి-ఆగస్టు మధ్య ఋణ బకాయిలను చెల్లించిన లబ్ధిదారులకూ ఇది వర్తిస్తుంది. రూ.2 కోట్ల లోపు ఎంఎస్‌ఎంఈ రుణాలు, విద్యా, హౌసింగ్ ,కన్జ్యూమర్ డ్యూరబుల్, క్రెడిట్ కార్డ్, ఆటో, పర్సనల్ రుణాలు తీసుకున్న వారికి ఇది అమలుకానుంది. ‘‘మహమ్మారి ప్రబలిన సమయంలో రుణ వడ్డీ భారాన్ని ప్రభుత్వం మోయటం ఒక్కటే పరిష్కారం’’ అని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.