చీడికాడ,మీడియా పవర్ : కోనాం జలాశయ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 340 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 100.40 మీటర్లకు చేరడంతో స్పిల్‌వే గేట్లను ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని బొడ్డేరుకు విడుదల చేయనున్నటు తెలిసింది. లీకేజీల రూపంలో 50 క్యూసెక్కుల నీరు పోతోందని, సాగునీటి కాలువలకు 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
కల్యాణపులోవ నాలుగు గేట్లు ఎత్తివేత
రావికమతం, మీడియా పవర్ : కల్యాణపులోవ జలాశయం పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనితో సాయంత్రం అత్యవసరంగా నాలుగు గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల వరద నీటిని దిగువ వరహాలోకి విడిచిపెడుతున్నారు. జలాశయం సామర్థ్యం 460 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 459.5 అడుగుల నీటి మట్టం నమోదైనది. దీనికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో 250 క్యూసెక్కులు వస్తున్నట్లు జలాశయం పర్యవేక్షణాధికారి సత్యనారాయణ దొర తెలిపారు.