వేంపల్లెలో సంతకాల ఉద్యమం... కార్యక్రమం లో పాల్గొన్న తులసిరెడ్డి
వేంపల్లె, కడప జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా వేంపల్లెలో ఆదివారం పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదింపచేసిన ఒప్పంద వ్యవసాయ చట్టం, వ్యవసాయ మార్కెట్ చట్టం, అత్యవసర సరకుల చట్టం రైతులు, వినియోగదారులకు వ్యతిరేకమన్నారు. ఈ చట్టాలు బడా వ్యాపార సంస్థలకు అనుకూలమన్నారు. వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు సోమవారం నుంచి జిల్లాలో రైతు వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. సంతకాల సేకరణ పత్రాలను ఈ నెల చివరిలోపు పార్టీ జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు.