ఢిల్లీ : సరిహద్దుల్లో ఎలాంటి ముప్పువాటిల్లిన ఎదుర్కొనేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) సంసిద్ధంగా ఉందని, అవసరమైతే ఏకకాలంలో చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధం చేయగలమని వాయుసేన దళాధిపతి ఆర్‌కేఎస్ బదౌరియా స్పష్టం చేశారుఢిల్లీ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాయుసేన సామర్థ్యంలో చైనా మనకంటే గొప్పేం కాదని బౌదరియా అన్నారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో పరిస్థితుల గురించి మీడియా ప్రశ్నించగా.. ‘సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం. వాయుసేన సామర్థ్యంలో భారత్‌లో పోలిస్తే చైనా మెరుగైనదేమీ కాదు. అయితే అదే సమయంలో శత్రువును తక్కువగా అంచనా వేసే ప్రసక్తే లేదు. లద్దాఖ్ సహా ఉత్తర సరిహద్దుల్లో సర్వాయుధాలతో మోహరించాం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉత్తర(చైనాతో), పశ్చిమ(పాకిస్థాన్‌తో) సరిహద్దుల్లో ఒకేసారి యుద్ధం చేసేందుకు ఐఏఎఫ్ సంసిద్ధంగా ఉంది’అని బదౌరియా తెలిపారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారానికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 12న రెండు దేశాల సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు పరిస్థితులకు అనుగుణంగా వేగంగా స్పందించేందుకు భారత్ కూడా సిద్ధంగానే ఉంది. ఇప్పటికే లద్దాఖ్ సరిహద్దుల్లో భారీగా బలగాలు, ఆయుధాలను మోహరించింది. సుఖోయి 30 ఎంకేఐ, జాగ్వర్, మిరాజ్ 2000 లాంటి యుద్ధ విమానాలను నిలిపింది. వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలు కూడా లద్దాఖ్‌లోనే పనిచేస్తున్నాయి. రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచింది.
Post a Comment
0Comments
3/related/default