ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేలు
అధికారిక ప్రకటన విడుదల
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు నియమితులయ్యారు. ఈనెల 14న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో ఈ మేరకు ఖరారు చేసినట్లు ప్రకటన విడుదలైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తుండగా పదోన్నతి పొంది తెలంగాణ హైకోర్టు సీజీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న ఆర్.ఎస్.చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేశారు. ఒడిశా హైకోర్టు సీజే జస్టిస్ మహమ్మద్ రఫీక్‌ను మధ్యప్రదేశ్‌కు, జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్‌ను కలకత్తాకు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ కొఠారిను గుజరాత్‌కు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను కర్ణాటకకు బదిలీ చేశారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ బదిలీల్లో ఐదుగురు న్యాయమూర్తులు పదోన్నతి పొంది సీజేలుగా బదిలీ అయ్యారు. జస్టిస్ హిమా కోహ్లితో పాటు మరో నలుగురు ఉన్నారు. వారిలో పంజాబ్, హరియాణా న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ ఒడిశా హైకోర్టు సీజేగా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ మద్రాస్ హైకోర్టు సీజేగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పంకజ్ మిథాల్ జమ్మూకశ్మీర్ హైకోర్ట్ సీజేగా, ఉత్తరాఖండ్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుధాంశు ధూలియా గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.