అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం
నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా
మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ రచించిన అంబేద్కర్ మానసపుత్రికే ఎన్నికల
సంఘం అని పేర్కొన్నారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి అని,
సుప్రీం కోర్టులో నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామని, నాలుగు దశల్లో
పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్
ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం
జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ
మధ్యాహ్నం మూడు గంటలకు సీఎస్, పంచాయతీ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలని
కోరామన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయని
పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే 2019 జాబితాతో ఎన్నికలు
నిర్వహిస్తున్నామన్నారు. కొత్త జాబితా ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని,
విధిలేని పరిస్థితుల్లో 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు
పేర్కొన్నారు. ఎన్నికలతోనే స్థానిక నాయకత్వం బలపడుతుందన్నారు. విధులు,
నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యం ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా
దృష్టి సారిస్తామని, ఐజీ స్థాయి అధికారితో ఏకగ్రీవాలపై
దృష్టిపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది
కొరత వంటి సమస్యలున్నాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం
కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం
నుంచి స్పందన లేదని, ప్రభుత్వ ఉదాసీనత వైఖరిపై గవర్నర్ దృష్టికి
తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.