హైదరాబాద్: ప్రవీణ్ రావు
సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ నుంచి పోలీసులు
కీలక సమాచారం సేకరించారు. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో అఖిలప్రియను బేగంపేటలోని పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు
నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం
అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఈసీజీతో పాటు పలు పరీక్షలు
నిర్వహించారు. అనంతరం గైనకాలజీ విభాగంలోనూ అఖిలప్రియకు పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల అనంతరం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడంతో మరోసారి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అఖిలప్రియ తరఫున ఆమె
న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై 16వ తేదీన
న్యాయస్థానం విచారణ జరపనుంది. మూడు రోజుల విచారణలో భాగంగా అఖిలప్రియను ప్రశ్నించిన
పోలీసులు భూవివాదానికి సంబంధించి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ
వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా ప్రవీణ్ రావు సోదరుల
నుంచి స్పందన లేకపోవడంతో అపహరణకు పాల్పడినట్లు అఖిలప్రియ పోలీసుల వద్ద
తెలిపినట్టు సమాచారం. మొదట అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని
ప్రశ్నించినా తనకు తెలియదని దాటవేసిన అఖిలప్రియ పోలీసులు చూపించిన
ఆధారాలతో ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకున్నట్లు సమాచారం. భార్గవ్ రామ్, జగత్
విఖ్యాత్ రెడ్డి కూడా బోయిన్ పల్లి వెళ్లి అపహరణను ప్రత్యక్షంగా
పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను
సేకరించారు. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులను
అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. వీరికోసం పోలీసులు
బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. హఫీజ్ పేటలో భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల
భూమిని ఆయన బినామీ ఏవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించేవారు. 2005లో కృష్ణారావు
అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు. న్యాయవాది కృష్ణారావు
మరణంతో... ఆయన కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు బాధ్యతలు
తీసుకున్నారు. ఈ భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉండటంతో 2015లో ఏవీ
సుబ్బారెడ్డి... ప్రవీణ్ రావు సోదరుల నుంచి నగదు తీసుకొని బయటికి
వెళ్లిపోయాడు. ఈ విషయం అఖిల ప్రియకు తెలియడంతో కొంత కాలంగా ప్రవీణ్ రావుతో
పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చారు. భూమా నాగిరెడ్డికి చెందిన
భూమిని ఎలా సొంతం చేసుకుంటారని, వాటా ఇవ్వాల్సిందిగా కోరింది.
నిరాకరించడంతో అపహరణ చేసి... బలవంతంగా భూమిని రాయించుకునేందుకు
ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయారు.
Post a Comment
0Comments
3/related/default