విశాఖపట్నం : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన గ్రామ పంచాయతీల నిర్వహణలో నోడల్ అధికారుల పాత్ర గురించి క్షుణ్ణంగా వివరించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో పోలింగ్ ముందస్తు చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. పోలింగ్ సామాగ్రి, స్టేషనరీ, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయడం జోనల్ అధికారులు, రూట్ అధికారుల నియామకం, వాహనాల ఏర్పాటు, రూట్ మ్యాప్ తయారీ, పోలింగ్ సిబ్బంది నియామకం, వీడియోగ్రఫీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల నియమావళి అమలు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది రవాణా, పోలింగ్ సామగ్రి అందజేయడం తీసుకోవడం, ఎన్నికల ఖర్చు, సమాచార నిర్వహణ, పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకుల నియామకం తదితర విషయాలపై తగు చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికారులను నియమించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటుచేసిన 18 బృందాల ద్వారా జిల్లా అధికారులు వారికి కేటాయించిన పనులను సమన్వయంతో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. నోడల్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. పోలింగ్ అధికారులకు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.
మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులను నిర్వహించాలని, అక్కడ నుండే ఎన్నికల సామాగ్రి, సిబ్బంది గ్రామాలకు పంపించాలన్నారు. కేంద్రాల్లోనే తొలి తుది శిక్షణా తరగతులు నిర్వహించాలని పోస్టల్ బ్యాలెట్ కూడా అక్కడే నిర్వహించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి కనీస వసతి భోజన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, మిక్కిలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి పి.అరుణ్ బాబు ఆర్.గోవిందరావు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి, డిఆర్వో ప్రసాద్ డిఆర్ డిఏ పీడి వి.విశ్వేశ్వరరావు ఆర్డీఓలు సీతారామారావు, పెంచల కిషోర్, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణమూర్తి, జడ్పీ సీఈఓ నాగార్జునసాగర్, జల్లా ఇన్ఫర్మేటివ్ అధికారి వైవికేఎస్ఆర్ మూర్తి, పశుసంవర్ధకశాఖ జెడి రామకృష్ణ తదితరులు పాల్గొనగా పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్.మౌర్య, ఆర్డిఓ లక్ష్మీశివజ్యోతి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.