అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టిన 20 నెలల్లోనే వలసలు బాగా పెరిగాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నవరత్నాల పేరుతో ప్రజలను ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ పెద్దలంతా పేదల వ్యతిరేకులని ధ్వజమెట్టిన అయన, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్నారని వాపోయారు. దేశంలో ఇటువంటి దుస్థితిలో వున్నా ఏకైక రాష్ట్రం ఏపీ అని అభివర్ణించారు. జగన్ పాలనలో పింఛన్ తీసుకునే లబ్ధిదారులు సంఖ్య గణనీయంగా తగ్గిందని కాలవ శ్రీనివాసులు విమర్శించారు. దాదాపు 20 లక్షలకు పైగా రేషన్‌కార్డులు తొలగించారని ఆరోపించారు. నిత్యవసరాలకు ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించటం వల్ల కందిపప్పు, పంచదార తదితర ధరలు పెరిగి ప్రజలపై రూ.750 కోట్ల అదనపు భారం పడిందన్నారు. ప్రజలు ఈ వాస్తవాలను గ్రహించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపరిచే అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన కోరారు.
Post a Comment
0Comments
3/related/default