చిత్తడి భూములను పరిరక్షించాలని బెందాళం పద్మావతి పిలుపు

MEDIA POWER
0

నేడు ప్రపంచ బురద నేలల దినం సందర్భంగా చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడిని గురించి ప్రతిఒక్కరు అవగాహని కల్పించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కళింగ వెల్ఫేర్ మరియు డెవోలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బెందాళం పద్మావతి సూచించారు.  ప్రతి ఒక్కరు తులసీబృంద జంపన పోస్టుచేసిన ఈ ప్రత్యేక వ్యాసాన్ని చదవాలని దానివల్ల బురద నెలలపై  అవగాహన కలగడంతో పాటు వాటిని ఎలా వుపయోగించుకోవాలన్న పరిజ్ఞ్యానాన్ని  పొందవచ్చని తెలిపారు. బురద నేలని సహితం కబ్జా చేస్తూ మానవుడు పరుగులు తీస్తున్నాడని అది  ప్రకృతి వినాశనానికి దారితీస్తుందని ఆమె భయాందోళనలను వ్యక్తం చేసారు. ప్రతి ఒక్కరు విధిగా చిత్తడి భూములను పరిరక్షించాలని పర్యావరణ పేమికురాలిగా , సామజిక భాద్యత తెలిసిన కార్యకర్తగా గుర్తింపు పొందిన బెందాళం పద్మావతి పిలుపు నిచ్చారు. 

నేడు ప్రపంచ బురద నేలల దినం సందర్భంగా ప్రత్యేక వ్యాసం  - తులసీబృంద జంపన

నదులు, సముద్రాలు, ఎడారులు, కొండలు, పీఠభూములు, అడవులు, బీడు భూములు, సతత హరితారణ్యాలు, మంచుకొండల్లాంటి అనేక రకాల భూమి ఉపరితల రూపాలు కలిస్తేనే అది సమగ్రమైన పర్యావరణం! ప్రకృతిలో ప్రతి భౌగోళిక రూపానికీ ప్రాధాన్యం ఉంది. కానీ, రెండు శతాబ్దాలుగా ఎడారుల విస్తరణ, సముద్రాల మట్టం పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి. చిత్తడి నేలల విస్తీర్ణం తగ్గుతుండటం మరో ప్రమాదాన్ని సూచిస్తోంది. ఈ ప్రమాదాన్ని 50 సంవత్సరాల కిందటే ప్రపంచం గుర్తించింది.

పర్యావరణానికి కీలకం: ఇరాన్‌లోని రామ్సర్‌ నగరం సమీపంలోని కాస్పియన్‌ సముద్రం ఒడ్డున 1970 ఫిబ్రవరి రెండో తేదీ నాడు మేధావులు, పర్యావరణవేత్తలు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సమావేశమయ్యారు. వీరంతా తడి నేలల విస్తరణను, పర్యావరణంలో వాటి ప్రాధాన్యాన్ని అంచనా వేశారు. చిత్తడినేలలు సహజంగా ఏర్పడతాయి. కానీ, వీటిని మనిషి కూడా సృష్టించవచ్చు. ఇది మనకు ఆనందాన్నిచ్చే విషయమే! ఎందుకంటే మనం ఏర్పరచే చిత్తడినేలలూ పర్యావరణంపై అంతే సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. రామ్సర్‌ సమావేశ తీర్మానం ప్రకారం చిత్తడినేల సముద్రం పక్కనుంటే ఆటుపోట్లకు గురవుతూ... గరిష్ఠంగా ఆరు మీటర్లలోతు నీరు నిల్వ ఉండాలి. సముద్రానికి దూరంగా లోతట్టు ప్రదేశాల్లోనూ బురద నేలలుంటాయి. ఈ బురద నేలల్లో నీరు ప్రవహించవచ్చు లేదా నిల్వ ఉండవచ్చు. మంచి నీరు కావచ్చు లేదా ఉప్పు నీరైనా కావచ్చు. చేపల చెరువులు, వరి మళ్లు, ఉప్పు తీసే నీటి కయ్యలు సైతం ఈ కోవలోకే వస్తాయి. ఇలా కొన్ని ప్రదేశాల్లో నీరు నిలిచి ఉండటం పర్యావరణానికి చాలా అవసరం.

చిత్తడి నేలల ప్రాధాన్యం ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతోంది. శీతోష్ణస్థితి నియంత్రణకు, వాతావరణంలో నీటి చక్రం సవ్యంగా కదలడానికి, వరదల నియంత్రణకు, నీటి పరిశుభ్రతకు, వాటిని ఆశ్రయించిన జీవజాలానికి ఈ బురద నేలలు చాలా ముఖ్యం. వీటి విస్తీర్ణం తగ్గితే దీర్ఘకాలంలో అనేక ఉత్పాతాలు కలుగుతాయి. బురదనేలలు గాలిలో అధికంగా ఉన్న బొగ్గుపులుసు వాయువును శోషించుకుని పర్యావరణాన్ని కాపాడుతూ భూతాపాన్ని తగ్గిస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు వీటిని భూమికి మూత్రపిండాల వంటివని అభివర్ణిస్తారు. ఈ నేలలు భూమిపై ఆరు శాతం మేర మాత్రమే విస్తరించి ఉన్నాయి. అయితే భూమ్మీద జీవించే జంతుజాలంలో 40శాతం ఈ నేలలనే ఆశ్రయించి ఉన్నాయి. పారిశ్రామికీకరణ, విచక్షణ లేకుండా ఆవాసాలను విస్తరిస్తుండటం, సరైన ముందుచూపు లేకపోవడంవల్ల బురదనేలలు వేగంగా కనుమరుగవుతున్నాయి. కిందటేడాది కాకినాడ సమీపంలోని మడ అడవులను నరికి, ఇళ్ల స్థలాలుగా మార్చడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 30 ఏళ్లలో మూడోవంతు చిత్తడి నేలలు మాయమయ్యాయి. అంతవేగంగా నివాస స్థలాలు విస్తురిస్తూ ఉండటంతో ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోతోంది. చిత్తడి నేలలు తగ్గడానికి పట్టణీకరణ, వ్యవసాయ విస్తరణ ప్రధాన కారణాలు. బురద నేలలు పర్యావరణంలోని కలుషిత పదార్థాలను శోషించి సహజ వడపోత యంత్రాలుగా పనిచేస్తాయి. మురికినీటిలో చేరే సల్ఫర్‌ పదార్థాలను అక్కడ పెరిగే కొన్ని మొక్కలు పీల్చుకుని నీటిని శుద్ధి చేస్తాయి. వాతావరణంలోకి నీరు ఇంకుతూ గాలిలో నీటి శాతాన్ని పెంచుతాయి. చిత్తడి నేలలు తగ్గిపోతే ఆ ఆవాసాల్లో జీవించే వేలాది జంతు జాతులు ఇతర ప్రదేశాలను ఆశ్రయిస్తాయి. దానివల్ల సమతౌల్యం దెబ్బతింటుంది.

మానవ తప్పిదాలతో ముప్పు: వాతావరణ పరిస్థితులు మారితే కొన్ని రకాల బ్యాక్టీరియా లేదా వైరస్‌లు వ్యాధికారకాలుగా మారతాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అడవుల్లో జంతువుల నుంచి ఉహాన్‌ నగరానికి, అక్కడి నుంచి యావత్‌ ప్రపంచానికీ విస్తరించడం తెలిసిందే. మానవుడు అన్ని జీవజాతుల ఆవాసాలనూ ఆక్రమిస్తూ చేజేతులా ముప్పు కొనితెచ్చుకొంటున్నాడనేందుకు ఇది ప్రబల నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలను నివారించడానికి కనీసం ఇప్పటికి మిగిలిన చిత్తడినేలలను అలాగే వదిలెెయ్యడమే ఏకైక పరిష్కారం. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లోనూ ఉన్న బురదనేలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేడు మనపై ఉంది. వాటిని ఆశ్రయించిన జంతుజాతుల కోసమే కాకుండా మన కోసం కూడా. పశ్చిమ్‌ బంగ నుంచి బంగ్లాదేశ్‌వరకు విస్తరించిన సుందర్బన్‌ చిత్తడి నేలల ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ‘యునెస్కో’ ప్రకటించింది. కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు 300 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. నేడు చాలా విస్తీర్ణాన్ని కోల్పోయింది. అయినా 2002లో యునెస్కో గుర్తింపు పొందింది. నేల పీల్చుకోలేనంత పరిమాణంలో నీరు ఉంటే అది నిల్వగా మారుతుంది. అది ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. చిత్తడి నేలల ఆరోగ్యాన్ని కాపాడితేనే అవి మన ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి!


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">