• పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై శ్రద్ద వహించాలి
• శిక్షణా కార్యక్రమాలకు సిబ్బంది తప్పని సరిగా హాజరు కావాలి .
విశాఖపట్నం: గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలపై నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ సూచించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతి ఎన్నికల ఏర్పాట్ల విషయమై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై స్పష్టతతో ఉండాలని నియోజక వర్గ ప్రత్యేకాధికారులతో సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. మంచినీటి సదుపాయము, విద్యుత్, అల్పాహారము, భోజనము, తదితర ప్రాధమిక అవసరాలన్నింటికి ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైన స్టేషనరీ సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవని తెలిపారు. నిబంధనల ప్రకారం పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారుల రాండమైజేషన్ నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలను ముందుగానే గుర్తించి సిబ్బందికి సూచనలివ్వడం, అవసరమైన ఏర్పాట్లు గావించడం చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంకు నిబంధనల ప్రకారం కోవిడ్ మెటీయల్ అందించాలని పేర్కొన్నారు. సిబ్బందికి నిర్వహించు శిక్షణా కార్యక్రమాలకు పూర్తి హాజరు తప్పనిసరి అని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి మండలానికి బ్యాలెట్లను తరలించాలన్నారు. వాహనాలను సిద్దం చేయాలని ఉప రవాణా అధికారి, ఎపిఎస్ఆర్టిసి, ప్రాంతీయ మేనేజర్ లను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ల గురించి పోస్టల్ అధికారులకు లేఖ వ్రాయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల పరిశీలన కీలకమన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ పై సిబ్బందికి నిర్దిష్టమైన సూచనలు ఇవ్వాలని తెలిపారు. రిజిష్టర్లు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశములో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, గ్రామ పంచాయితీ ఎన్నికల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.