అమరావతి : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని
ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కృష్ణా జిల్లా
ఎస్పీని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన మంత్రిపై కేసులు నమోదు
చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘించడంతోపాటు బెదిరించడం,
కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై ( ఐపీసీ 504, 505, 506) సెక్షన్ల
కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీకి పంపిన లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు. రాష్ట్ర
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రి కొడాలి నాని అనుచిత
వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శుక్రవారం ఎస్ఈసీ
నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కొందరు మీడియా
అధినేతలపై మంత్రి కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేసారని దీనిపై ఎస్ఈసీ ఆయనకు
షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో మంత్రి కొడాలి నాని తన న్యాయవాది
చిరంజీవితో వివరణ ఇప్పించారు. ఈ వివరణతో ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. వివరణ
ఇచ్చిన అనంతరం మంత్రి తరఫు న్యాయవాది చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సైతం
అభ్యంతరకరంగా ఉండటంతో మంత్రి నానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.