ప్రజాభీష్టాన్ని కేంద్రం ముందుకు తీసుకువెళ్తా .
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పరిస్థితిని వివరిస్తానని ప్రజాభీష్టాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతానని కేంద్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత తమకు తెలిసిందన్నారు. విశాఖలో భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంతో ప్రజలకు విడదీయరాని బంధముందన్నారు. తనకూ ప్రత్యేక అనుబంధం ఉందన్నారు . ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని పురందేశ్వరి హామీ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో విశాఖ మెట్రోకు ప్రాధాన్యత ఇచ్చారని పురేందేశ్వరి అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ విషయాలు అమలు చేయలేదో చెప్పాలన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అసాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారని, 5 ట్రిలియన్ లక్ష్యం దిశగా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు. బడ్జెట్‌లో ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి, దేశ అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్యం విషయంలో కీలక ప్రాధాన్యత ఇవ్వడం ఆనందదాయకమన్నారు .