ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 15 ఏళ్ల భారతీయ జనతా పార్టీ (భాజపా ) పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తుడిచేసింది. బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ( ఆప్) విజయకేతనం' ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ 126 సీట్లను దాటిన ఆప్ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో భాజపా 104 వార్డులను గెలుచుకోగా ఆ పార్టీ డిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా నియోజకవర్గం పటేల్ నగర్‌లోని నాలుగు వార్డుల్లోనూ కాషాయ పార్టీ ఓటమిపాలవ్వడం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూలపడింది . ఈ ఫలితాల్లో హస్తం పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు.
1958లో ఏర్పాటైన మునిసిపల్ కార్పొరేషన్ ఢిల్లీ 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. డిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దశాబ్దంన్నర పాటు భాజపా అధికారం సాగించింది. . 2017 మున్సిపల్ ఎన్నికల్లో భాజపా 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ డిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆప్ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
* మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై విశ్వాసం చూపించినందుకు డిల్లీ ప్రజలకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల తీర్పుతో మేం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీని ఓడించగలిగాం. ఇది మాకు కేవలం విజయం మాత్రమే కాదు. ఓ పెద్ద బాధ్యత అని అయన అన్నారు.
* పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ డిల్లీ అసెంబ్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను అరవింద్ కేజ్రీవాల్ పెకిలించారు. ఇప్పుడు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపాను కూడా గద్దెదించారని, దీనితో విద్వేష రాజకీయాలను డిల్లీ ప్రజలు ఇష్టపడటం లేదని రుజువైందలర్ అన్నారు. స్కూళ్లు, ఆసుపత్రులు, విద్యుత్, పరిశుభ్రతకే వారు ఓటేశారని తెలిపారు.
* భాజపాకు డిల్లీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అభివృద్ధి కోసం పనిచేసిన వారికే ప్రజలు ఓటేశారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌పై భాజపా చల్లుతున్న బురదను ప్రజలు తుడిచేశారని , ఇక, మా పార్టీ డిల్లీని ప్రపంచంలోనే అందమైన నగరంగా మారుస్తుందని తెలిపారు.