పరిరక్షణకు విరివిగా రీఛార్జ్ పిట్స్
ఊట బావుల చుట్టూ ట్రెంచ్‌ల నిర్మాణం
భూగర్భ జల అంచనా 2021-22 వెళ్లడి
విజయనగరం, డిసెంబరు 19: జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా, అతితక్కువ లోతులోనే అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అన్నారు. భూగర్భ జల అంచనా 2021-22 వివరాలను, సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో వెళ్లడించారు. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపైనా ఉందని అన్నారు.
భూగర్భ జలాల విషయంలో మన జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ చెప్పారు. సగటున కేవలం 1.99 మీటర్ల లోతులోనే మనకు భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల గత కొంతకాలంగా జిల్లాలో సమృద్దిగా వర్షాలు కురవడం వల్ల, భూగర్భ జల మట్టం పెరిగిందని తెలిపారు. అందుబాటులో ఉన్న భూగర్భ జలాన్ని సక్రమంగా వినియోగించుకొనేందుకు తగిన ప్రణాళికలను అమలు చేయాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. అందరికీ సురక్షిత త్రాగునీటిని అందించడం, రబీలో కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచడం, పరిశ్రమలను ప్రోత్సహించడం తగిన చర్యలను చేపట్టాలని సూచించారు. ఇదే సమయంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు, మరింతగా పెంచేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తక్షణమే మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా విరివిగా రీఛార్జి పిట్స్ ను, చెక్ డ్యాములను, ఇతర రీఛార్జి కట్టడాలను నిర్మించాలని సూచించారు. దీనికోసం అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని ఆదేశించారు.
త్రాగునీటి పథకాలకు సంబంధించిన ఊటబావుల వద్ద భూగర్భ జలాలు తగ్గిపోకుండా, ఈ బావులు కలుషితం కాకుండా, వీటి వద్దనున్న ఇసుకను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికోసం పథకాల చుట్టూ ట్రెంచ్‌లను నిర్మించాలని సూచించారు. చెరువు గట్లు వద్ద, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటాలని చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడటంతోపాటు, జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే పశు సంపద వృద్ది కోసం పచ్చిక బయళ్లు, గయాళు భూములను కాపాడాల్సిన బాద్యత ఉందన్నారు. ఫారమ్ పాండ్స్ నిర్మాణాన్ని పెంచాలని సూచించారు. పరిశ్రమల్లో నీటిశుద్ది కర్మాగారాలను నిర్మించడంతోపాటు, రీఛార్జి కట్టడాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
భూగర్భ జలశాఖ డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ, భూగర్భ జల అంచనా 2021-22 ముఖ్య అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతీ రెండేళ్లకు ఒకసారి భూగర్భ జల అంచనాలను రూపొందించడం జరుగుతుందని చెప్పారు. 1973లోనే భూగర్బ జలాల అంచనాలు మొదలయ్యాయని, 2015లో రూపొందించిన నూతన విధానం ప్రకారం, 2016 నుంచి అంచనాలను రూపొందించడం జరుగుతోందని చెప్పారు. జిల్లాలో వర్షపాతం సగటున సుమారు 1130 మిల్లీమీటర్లు ఉందని, దీనిలో 9 శాతం వరకు భూగర్భ జలంగా మారుతుందని తెలిపారు. జిల్లాలో సుమారు 1132 వాగులు, గెడ్డలు, నదులు తదితర నీటి ప్రవాహాలు ఉన్నాయని, వీటి ద్వారా కూడా నీరు భూగర్భ జలంగా మారుతోందని చెప్పారు. ఇష్టానుసారం బోరుబావులు తవ్వే అవకాశం లేదని, బోరు తవ్వేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో 150 మీటర్ల లోతుకు మించి బోరు తీయడానికి ఆమోదం లేదని తెలిపారు. భూగర్భ జలాల విషయంలో విజయనగరం జిల్లా సురక్షిత స్థానంలో ఉందన్నారు.
ఈ సమావేశంలో సిపిఓ పి.బాలాజీ, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావు, పశు సంవర్థక అధికారి డాక్టర్ వైవి రమణ, మత్స్యశాఖాధికారి నిర్మలాకుమారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ ఉమాశంకర్, డ్వామా పిడి జి.ఉమాపరమేశ్వరి, ఎపిఎంఐపి పిడి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, పరిశ్రమలశాఖ జిఎం పాపారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.