విశాఖపట్నం, డిసెంబర్-28:- పర్యావరణ సమతుల్యతతోనే నగర ప్రజల శ్రేయస్సు ముడిపడి వుందని జివిఎంసి కమిషనర్ పి రాజా బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నగర ప్రజలకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన మరింత పెంచవలసిన ఆవశ్యకత ఉందన్నారు. విశాఖ నగరం నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా తరిమివేయాలని, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దెందుకు, ప్రజల సహకారంతో ముందుకు పోవాలని అధికారులకు తెలిపారు.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ జోన్-5, 2022వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించిందని, ఇందుకు గాను దశలవారీగా 75 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ తయారీ, రవాణా, సరఫరా, అమ్మకం, నిల్వ, వాడుక వంటివి పూర్తిగా నిషేధించామని, తేది.31, డిసెంబర్’ 2022 నాటి నుండి 120 మైక్రాన్ల కంటే తక్కువ వున్న ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి నుండి మన భావితరాల వారిని కాపాడుకోవలసిన అవసరం ఉందని, అందుకు గాను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా “క్లాత్ బ్యాగు ఛాలెంజ్” అనే వినూత్న కార్యక్రమానికి జివిఎంసి శ్రీకారం చుట్టి అన్ని పాఠశాలలో విద్యార్ధులకు వస్త్ర, జనపనార సంచులపై అవగాహన కల్పించడం జరిగిందని, వారు తయారు చేసిన సంచులు, పర్యావరణ పరిరక్షణ సందేశాలను ఛాయా చిత్రాల ద్వారా ప్రచారంలోకి తెచ్చిన తీరు తెలుసుకున్న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “మన్ కి భాత్” కార్యక్రమంలో విశాఖ నగరాన్ని ప్రసంశించారని తెలిపారు. అంతేకాకుండా జివిఎంసి పటిష్టమైన సచివాలయ యంత్రాంగం వుందని, దీని ద్వారా ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రతి రోజూ “గుడ్ మార్నింగ్” ఎడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియాలో ప్రజలకు చేరువ అయ్యాయని తెలిపారు. నగరంలో పండుగలు, రకరకాల వేడుకల నిర్వహణలో ప్లాస్టిక్ రహిత వస్తువులు వాడే విధంగా ప్రజలకు తెలియపరిచామని తెలిపారు.
సుందర విశాఖ నగరంలోని సముద్ర తీర ప్రాంతాలలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో 40 ప్రాంతాలలో సుమారు 25వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు గాను నగరం ప్రపంచంలో అతిపెద్ద బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం నిర్వహించి “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు” లో చోటును సంపాదించుకొని విశ్వ విఖ్యాతిని సొంతం చేసుకుందన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం అమలు చేస్తున్నందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వేదికగా అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లేక్షీలను నిషేధిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తు చేసారు. వీటితో పాటూ రెండు లక్షల నలభై ఐదు మంది విద్యార్ధినీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ప్లాస్టిక్ ను వాడరాడని, లేఖల ద్వారా చేపట్టిన “బిగ్ ప్రామిస్” కార్యక్రమంలో “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు” లలో చోటు దక్కించుకుందని తెలిపారు. ఈ విధంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ స్వచ్చంద సంస్థలు, స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, సెలబ్రేటీలు, రెసిడేన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జిఓ లు తదితరులు నగరాన్ని సుందరంగా ఉంచేందుకు నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలనకు, ఇప్పుడు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరింత సహాకారం అందించాలని పర్యావరణ సమతుల్యతకు సహకరించాలన్నారు.