విశాఖపట్నం: ప్రభుత్వ భూముల ఆక్రమణ వివరాలు జీవీఎంసీ అధికారుల దృష్టికి వెల్లు వెత్తుతున్నాయి. దీనితో వాటిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు దక్కుతాయని అధికారులు యోచిస్తున్నారు. జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం సుమారు మూడు వారాలుగా నిర్వహించిన ప్రత్యేక స్పందనకు ఫిర్యాదులు భారీగానే అందాయి. ఇప్పటికే వచ్చిన రమారమి వెయ్యి ఫిర్యాదుల్లోని వివరాల ఆధారంగా ప్రణాళిక రచిస్తున్నారని తెలుస్తోంది.
ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని వాటిని పార్కింగ్ స్థలాలుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సీతమ్మధార, గాజువాక, సెవెన్‌హిల్స్ కూడళ్ళలోనూ చుట్టు ప్రక్కల ప్రాంతాలలోసూ ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. వాటిని యుద్ధప్రాతిపదికన పార్కింగ్ చేసేందుకు అనుకూలంగా మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. భవన నిర్మాణాల విషయంలోనూ నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబరు 8187897569ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ నెంబర్ 24/7 అవునో కాదో తెలియ రాలేదు.
ఇప్పటికే సీతమ్మధారలో ఉన్న జాతీయ బ్యాంకు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొన్నేళ్లుగా బ్యాంకు అధికారులు, ఖాతాధారులు పార్కింగుకు ఉపయోగించుకుంటున్నారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఆ బ్యాంకుకు చెందిన కీలక విభాగాలున్నాయి. నగదు లావాదేవీలకు చెందిన కొన్ని వ్యవహారాలు ఇక్కడి నుంచే సాగుతాయి. ఆ ప్రాంతానికి సమీపంలోనే జీవీఎంసీ అధికారులు బుధవారం తవ్వకాలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండానే ఇలా చేయడం తగదని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. మరో వైపు ‘బ్యాంకు ముందు ఉన్న స్థలం వందశాతం జీవీఎంసీకి చెందినదేనని, ఇక్కడ కూడా ఒక పార్కింగ్ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని ’ అని కమిషనర్ రాజాబాబు పేర్కొన్నారు.
నగరంలో వాహన రద్దీ పెరగటంతో పాటు వాహనాలు నిలిపేందుకు కావలసిన ప్రదేశాలు తక్కువే ఉన్నాయి. బీచ్‌రోడ్డులో ఏళ్ల కిందటి నుంచి మూడు పార్కింగ్ స్థలాలు, డైమండ్ పార్క్ ప్రాంతంలో ఒకటి ఉన్నాయి. ఇటీవల జగదాంబ కూడలిలో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం ప్రారంభించారు. సిరిపురం వుడా భవనం ఎదురుగా మరొకటి నిర్మాణంలో ఉన్న సంగతి మీడియా పవర్ పాఠకులకు విధితమే. దత్ ఐలాండ్ దగ్గర కొన్ని వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. అవి మినహా నగరంలో అధికారికంగా పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడా లేక పోవడంమే వీటిని అభివృద్ధి చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
జీవీఎంసీ అధికారులు ఇరుకు ప్రదేశాలలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంమే కాకుండా వాటికి ఆక్యుపెన్నీ సర్టిఫికేట్లనూ విచ్చల విడిగా ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీనితో పరోక్షంగా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని విధ్యాదికుల వాదన. అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవలసిన అధికారులు ఉందుకు ఉదాసీనత చూపుతున్నారన్న ప్రశ్నకు ఎంత వెతికినా సమధానం కరువే. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాన్ని చూపించినా వాహన చోధకులు రోడ్డుపై ఎక్కడ అనుకూలం అనుకుంటే అక్కడ పార్కింగ్ చేయడంతో పోలీసు అధికారులకు ఇది ఒక సవాలుగా మిగులుతోంది. కొంత మంది వ్యాపారస్తులు ప్రభుత్వ స్థలాలను వారి వారి ఖాతాధారుకు పార్కింగ్ మరియు ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. వాహనాలన్నీ రద్ధీ పెరిగితే రహదారులపై కూడా పార్కింగ్ చేసేస్తున్నారు. అటు వంటి పరిస్థితులలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు దారితీస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే స్పందన’కు వస్తున్న ఫిర్యాదులపై దృష్టిసారిస్తున్నామని, ‘నగరంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని, వాటిని స్వాధీనం చేసుకొని పార్కింగ్ ప్రదేశాలుగా, ఇతర ప్రయోజక ప్రాంతాలుగా మారుస్తామని, అక్రమ నిర్మాణాలను, ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని ’ జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు స్పష్ఠం చేసారు.