హైదరాబాద్: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తెలంగాణ రాజకీయ నాయకురాలు, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఆమె చేయ తలపెట్టిన సుదీర్ఘ పాదయాత్రకు మరోసారి అంతరాయం కలిగింది.
శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన సతీమణి ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు.
అనంతరం ఆమె లోటస్ పాండ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శంకర్ నాయక్ కు మద్దతుగా ఈ రోజు ఉదయం వందలాది మంది బీఆర్ఎస్ గూండాలు మాపై మరోసారి దాడి చేసి బెదిరించారని తెలిపారు. శంకర్ నాయక్ మాపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని, మా పేర్లు చెప్పి వలసదారులుగా సంబోధించారన్నది వాస్తవం కదా అని ప్రశ్నించారు. మేము అతనికి చర్యలపై గట్టిగా ప్రతిస్పందించాము ఇది నేరం ఎలా అవుతుందని అన్నారు. హైకోర్టు అనుమతించిన పాదయాత్రను ఎలా ఆపి అనుమతి రద్దు చేస్తారని ప్రశ్నించారు.
శనివారం తన నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ శంకర్ నాయక్ తనను బయటి వ్యక్తి అని, అనడమే కాకుండా తనను కించపరిచే విధంగా మాట్లాడారని మీడియాకి తెలిపారు. ఆయన తప్పులను ప్రశ్నించినందుకు, నియోజకవర్గంలో సుపరిపాలన అందించడంలో విఫలమైనందుకు తమపై అసభ్య పదజాలం వాడే ధైర్యం ఈ ఎమ్మెల్యేకు ఎవరిచ్చారని అన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, భూకబ్జాలకు పాల్పడ్డారని శంకర్ నాయక్ అవినీతిపరుడని ఆమె ఆరోపించారు. 'ఎవరినీ సెటిలర్లు, వలసదారులు అని పిలవొద్దని హెచ్చరిస్తున్నాను. మీ భార్య నెల్లూరుకు చెందినదని, తెలంగాణపై మీ ప్రేమను నిరూపించుకోవడానికి ఆమె నుంచి విడిపోవాలని శంకర్ నాయక్ ను ఉద్దేశించి షర్మిల అన్నారు. మహిళా ప్రభుత్వ అధికారితో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని, గిరిజన ప్రజల భూములను కబ్జా చేశారని ఆమె ఆరోపించారు.
మహిళలను లక్ష్యంగా చేసుకుని, అసభ్య పదజాలంతో, అసమ్మతిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ ఎస్ ప్రభుత్వ క్రూరత్వం తారాస్థాయికి చేరిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ నాయక్ తనను ఆంధ్రప్రదేశ్ కు చెందిన సెటిలర్ అని పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.