శ్రీశైలము .... శివదేవుని స్థిర విలాసం ... భక్తుల ముక్తి రసాలము .... అటువంటి పుణ్యక్షేత్రాన్ని చేరి తరించాలని అనుకునే భక్తుల జన జాతర! అందరూ ఆరాధించే దైవం ఆ మహాశివుడు శివుడు. అందరినీ ఆకట్టుకునేది శివతత్తం. మహన్యాసంతో కొందరు కొలిస్తే... రుద్రంతో మరికొందరు ఆ దేవదేవుడిని అభిషేకిస్తారు.
ఉజ్జయినిలో మహాకాలేశ్వరుడు. కాశీలో విశ్వేశ్వరుడు. సౌరాష్ట్రలో సోమనాథుడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో పేరుకో తీరున వెలిసిన వెండికొండల వెలుగు రేడు.. తెలంగాణలో రాజరాజేశ్వరుడు. జానపద భక్తులకు మల్లన్న. సామాన్య ప్రజలకు లింగమూర్తి. అసాధారణ మొక్కులు అందుకునే సదాశివుడు మహా శివరాత్రి పర్వం దగ్గరపడటంతో సర్వ శైవక్షేత్రాలు జనజాతరకు సిద్ధమవుతున్నాయి. కోడెమొక్కుల చెల్లింపులు, కోరమీసాల సమర్పణలు, అగ్నిగుండం దాటడాలు, అడవిదారిలో ప్రయాణాలు.. ప్రతి సన్నివేశం శివాత్మకమే! ప్రతి భక్తుడూ శంకర కింకరుడే!!
అందరూ ఆరాధించే దైవం శివుడు. అందరినీ ఆకట్టుకునేది శివతత్తం. మహన్యాసంతో కొందరు కొలిస్తే , రుద్రంతో మరికొందరు అభిషేకిస్తారు. ‘ఓం నమః పార్వతి పతయే ..అంటూ ఆ హరోం హర త్రిశుల పాణిని ... మహాదేవ శంభో ... హర సర్వేశ్వర .. హర విశ్వేశ్వర శ్రీశైల శంభో అంటూ ఎలుగెత్తి పిలిచే భక్తుల మొరను ఆలకిస్తాడు. అష్టదిక్పాలకుల్లో ఒకడైన కుబేరుడూ ఆయన భృత్యుడే! నిత్య దరిద్రం అనుభవించిన చిరుతొండనంబి కూడా శివయ్య దాసుడే! ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణాలోని పల్లెపల్లెనా శివతత్త్వం పల్లవిస్తుంది. ఆ శివయ్య లీలలను జానపద గీతాలుగా అల్లుకొని పాడుకోవడం మన సంస్కృతి. జాతరలతో, జాగారాలతో జంగమ దేవుణ్ని ఆరాధించడం మనసనాతన సంప్రదాయం.
‘ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం’ ‘నాలో ఆత్మవు నీవే. నీలో సగమైన పార్వతి నా బుద్ధికి ప్రచోదన శక్తి. నా పంచప్రాణాలు నీ సహచరులు. నా శరీరం నీ గృహం. ఇందులో నివసించు తండ్రీ. నేను అనుభవించే విషయోప భోగాలన్నీ నీ పూజలే. నిద్రే సమాధిస్థితి. లౌకిక సంచారంలో నేను వేసే ప్రతి అడుగూ నీకు ప్రదక్షిణే. నా ప్రతి పలుకూ స్తోత్రపాఠమే. నా ప్రతిచర్యా నీ ఆరాధనమే.’ జగద్గురువు, జ్ఞాననిధి ఆదిశంకరాచార్యుల శివమానస పూజ స్తోత్రంలోని ఒక శ్లోకం అర్థం ఇది. శివపూజకే కాదు, ఏ పూజకైనా ఇదే సూత్రం. ఏ ఆరాధనకైనా ఇదే మంత్రం. మనసును లగ్నం చేయడమే మంత్రం పరమార్థం అని గ్రహించిన వేడుకునే భక్తుల పాలిటి పెన్నిధి ఆతడు.
అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఈ పద్యం భగవత్ కృపకు నిర్మలమైన భక్తి మాత్రమే కొలమానం అని చెబుతుంది. అలాంటి నిత్యసత్యమైన భక్తితో స్వామిని కొలిచి తిన్నడు భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. బోయగా పుట్టిన అతనికి నమకం రాదు. చమకం అంతకన్నా తెలియదు. తిన్నడు పంచాక్షరి మంత్రాన్నీ తిన్నగా పఠించలేడు. అయితేనేం, బ్రహ్మాది దేవతల వంటి సేవకులను వీడి.. బంటుకు బంటుగా వచ్చి అనుగ్రహించిన కన్నప్ప కథ భక్తులపై భోళా శంకరుడి అవ్యాజమైన కృపను తెలియజేస్తుంది. నమ్మి కొలిస్తే చాలు.. కొమ్ముకాస్తాడు. అందుకే, శివయ్యకు అందరూ భక్తులే! ఆబాలగోపాలమూ అభిషేకిస్తుంటే సరిగంగ స్నానాలు చేస్తున్న అనుభూతికి లోనవుతాడు.
ఆంధ్రరాష్ట్రంలో ఉన్నపవిత్రమైన ఐదు పంచారామ క్షేత్రాలలో అమరారామం ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పల్నాడు జిల్లాలోని అమరావతి పట్టణంలో ఉంది. అమరేశ్వర స్వామి లేదా అమరలింగేశ్వర స్వామి గా ఈ ఆలయంలోని శివుడిని ఎక్కడి భక్తులు కొలుస్తారు.
ధరణికోట రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరేశ్వరుని గొప్ప భక్తుడు. దేవాలయాన్ని విస్తరించి, పునరుద్ధరించాడు. ఒకసారి రాజు తన దేశంలో తిరుగుబాటును అణచివేసే క్రమంలో చెంచుల ఊచకోతకు గురికావాల్సి వచ్చిందని, ఆ తర్వాత మానసిక ప్రశాంతతను కోల్పోయాడని, అమరావతికి వచ్చి అమరలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం అది తిరిగి వచ్చిందని ప్రసిద్ధ పురాణం చెబుతుంది.
అమరావతి కోట పీఠాధిపతులు, విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల శాసనాలు కూడా అమరావతి ఆలయ గోడలపై ఉన్నాయని స్థలపురాణం చెప్తుంది. ముఖమండపం లోని ఒక స్తంభం మీద కోటరాజు కేతరాజు మంత్రి అయిన ప్రోలి నాయుడు భార్య ఒక శాసనాన్ని వదిలివెళ్లినట్టు కథనాలు ప్రచారంలో ఉన్నాయి .
శివుని పవిత్రమైన ఐదు పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామం మరొకటి. ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా ద్రాక్షారామం పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో భీమేశ్వర స్వామి గా భక్తులతో కొలవబడుతున్నాడు ఆ మహా శివుడు.
క్రీ.శ 9 మరియు 10 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్య రాజు భీముడు దీనిని నిర్మించినట్లు ఆలయంలోని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయం యొక్క పెద్ద మండపాన్ని తూర్పు గంగా రాజవంశం రాజు మొదటి నరసింగ దేవా ఒడిషాకు చెందిన గంగా మహాదేవి (కోడలు) నిర్మించింది. నిర్మాణ పరంగా, శిల్పపరంగా ఈ ఆలయం చాళుక్య, చోళ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబింబిస్తూ భక్తులకు దర్శనమిస్తాయి.
దక్షయజ్ఞం జరిగిన ప్రదేశంగా దక్షారామం సుప్రసిద్ధి చెందింది. వీరభద్రుడు ఈ ప్రదేశంలో చేసిన మారణహోమం అనంతరం శివుడు ఈ ప్రదేశాన్ని పవిత్రం చేశాడని ప్రతీతి.
భీమేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యులు పునరుద్ధరించిన పెద్ద ఆలయయంగా ప్రసిద్ధి చెందింది. అంటే కాదు ఈ ఆలయంలో "సప్త గోదావరి" అని పిలువబడే పుష్కరిణి ఉంది, ఇక్కడ సప్త ఋషులు ఏడు వేర్వేరు నదుల నుండి నీటిని తీసుకువచ్చి దీనిని సృష్టించారన్నది స్థలపురాణం. సప్త గోదావరి పుష్కరిణిలో ఉన్న చిన్న మండపంలో సప్తర్షులను చూడవచ్చు.
ద్రాక్షారామానికి సంబంధించిన ప్రధాన పండుగలు మహా శివరాత్రి మరియు దసరా రోజులలో బాకుతూ ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు.
హిందూ దేవుడైన శివునికి పవిత్రమైన ఐదు పంచారామ క్షేత్రాలలో సోమరామం ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. ఇది జాతీయ ప్రాముఖ్యత పొందడంతో కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలలో ఒకటి గా నిలిచింది. ఈ ఆలయం పురాతనమైనదే అయినా గోడలపై ఉన్న పెయింటింగ్స్, శిల్పాల కారణంగా కొత్తగా కనిపిస్తుంది. ఆలయం ముందు భాగంలో చంద్రకుండం అని పిలువబడే తామరతో కప్పబడిన చెరువు, ఆలయ ప్రవేశద్వారం వద్ద పెద్ద గోపురం ఉన్నాయి. ఆలయానికి ఎడమవైపు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు ఉన్న పెద్ద మండపం భక్తులకు కనువిందు చేస్తాయి. ఆలయానికి కుడివైపున ఆలయ కార్యాలయం పైన ఓపెన్ హాల్ ఉంది. ఇక్కడ పూజారులు / పండితులు భక్తులకు పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అనేక శిల్పాలు ఉన్నాయి. ఆలయ మండపంలో పెద్ద నంది విగ్రహం ఉంది. హాలు దాటిన తర్వాత గర్భగుడి ముందు ఒక గది ఉంటుంది. ఆ గదిలో అన్నపూర్ణమాత ఆలయం ఉంది. దేశంలో మరెక్కడా కనిపించని విధంగా శివాలయం పైన అన్నపూర్ణ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం మరో ప్రత్యేకత. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అమ్మవారు మెడలో పవిత్ర దారాన్ని, పాదాల దగ్గర బిడ్డను కలిగి ఉండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నపంచారామాలలో మరో ప్రసిద్ధ శివక్షేత్ర క్షీరారామం మరొకటి. ఎక్కడ మహా శివుడిని భక్తులు సోమేశ్వరస్వామిగా కొలుస్తారు. సోమేశ్వరుని సతీమణి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ ప్రదేశంలోని శివలింగాన్ని చంద్ర భగవానుడు ప్రతిష్టించాడు. మహా శివరాత్రి, శరన్నవరాత్రులు ఈ ఆలయంలో జరిగే ప్రధాన పండుగలు కావడంతో ఎక్కడి తెలయమ్ భక్తులతో కిటకిట లాడుతోంది.
చరిత్ర పుటలు తిరగేస్తే ఈ ప్రాకారాన్ని 10వ శతాబ్దంలో శ్రీ వెలుపతి రూపొందించారు. నిర్మాణ పద్ధతి చాళుక్యుల కాలంలో నిర్మించిన వాటిని పోలి ఉండటం గమనార్హం. 14వ శతాబ్ధంలో అప్పటి శ్రీ అల్లాదురెడ్డి సారథ్యంలో గోపురం నిర్మించబడింది. 17వ శతాబ్దంలో కళ్యాణ మండపం (చౌటుప్ప), అష్ట భుజ లక్ష్మీ నారాయణస్వామి ఆ లయం నిర్మించబడ్డాయి. ముక్తిని పొందడానికి క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి వేలాది మంది భక్తులు ప్రార్ధనలు చేసే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. మరో విశేషం ఏమిటంటే క్షీరారామ ఆలయ గోపురం 120 అడుగులతో ఆంధ్రప్రదేశ్ లోనే ఎత్తైన గోపురంగా ప్రసిద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలలో చివరిగా కుమారరామ లేదా భీమేశ్వర ఆలయం శివుడి పవిత్రమైన ఐదు పంచారామ క్షేత్రాలలో ఇది మరొకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంది.
ఈ ఆలయం సామర్లకోట నగరానికి 1 కిలోమీటరు దూరంలో ఉంది. మందిరంలో ప్రతిష్ఠించిన సున్నపురాయి లింగం 16 అడుగుల ఎత్తు ఉంటుంది, ఈ ఆలయంలో 100 స్తంభాలతో కూడిన మండపం ఉంది. ఇది చాలా నిర్మాణ ప్రాముఖ్యతను కలిగి వున్నా ఆలయం గా ప్రసిద్ధి చెందినది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద శివలింగానికి రక్షణగా ఏకశిల నంది ఉంది. ద్రాక్షారామంలోని ఇతర పంచారామ దేవాలయాన్ని పోలి ఈ ఆలయంలో శివుడు భీమేశ్వరునిగా పిలుస్తారు. తూర్పు దిక్కున కోనేటి మండపం ఉంది. పుష్కరిణి (కోనేరు) ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయం యొక్క పెద్ద మండపాన్ని తూర్పు గంగా రాజవంశం రాజు మొదటి నరసింగ దేవా ఒడిషాకు చెందిన గంగా మహాదేవి (కోడలు) నిర్మించిందని పురాణాలు చెప్తున్నాయి.
నవంబరు-డిసెంబరు నెలలో వచ్చు కార్తీక, మార్గశిర మాసాలలో) ప్రతిరోజూ ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి - మార్చి (మాఘ బహుళ ఏకాదశి) సమయంలో ( స్వామివారి కల్యాణ మహోత్సవం) ఉంటుంది. మహా శివరాత్రి వరకు ఈ ఆలయంలో ఘనంగా జరిగే వేడుకలను భక్తులకు నయనానందాన్ని కలిగిస్తాయి.
హిందూ దేవుడైన శివునికి పవిత్రమైన ఐదు పంచారామ క్షేత్రాలలో క్షీరారామం ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. శివుడిని స్థానికంగా క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. శివలింగాన్ని విష్ణువు స్థాపించాడు. క్షీరారామంలో ఒక్కరోజు బస చేస్తే వారణాసిలో ఏడాది పాటు బస చేసినట్లేనని నమ్ముతారు. [వివరణ అవసరం] ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలలో ఒకటి.
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టులో కొలువుదీరిన దైవం జడల రామలింగేశ్వర స్వామి. ఆరోగ్యప్రదాతగా పేరున్న రామలింగేశ్వరుణ్ని జానపదులు కొంగుబంగారంగా భావిస్తారు. ప్రపంచశాంతి కోసం పరశురాముడు శివలింగాలను ప్రతిష్ఠించిన 108 క్షేత్రాలలో చెర్వుగట్టు చివరిదిగా స్థలపురాణం. కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తుల కోరికలు తీరుస్తానని పరశురాముడికి పరమేశ్వరుడు చెప్పాడట. చెర్వుగట్టులో ఎత్తయిన మూడు గుండ్ల మధ్య దర్శనమిస్తాడు రామలింగేశ్వరుడు. ఈ గుండ్లను ఎక్కి, స్వామివారి పాదుకలను శిరస్సున ధరించి ప్రదక్షిణలు చేసిన వారికి అనారోగ్య బాధలు తొలగిపోతాయనీ నమ్మకం. శివరాత్రి సందర్భంగా చెర్వుగట్టు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. స్వామిని దర్శించుకొని తరిస్తారు. ఇక అమావాస్య నాడు చెర్వుగట్టు క్షేత్రంలో నిద్ర చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అందుకే, ప్రతి అమావాస్యకు వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తారు. అంతేకాదు 3, 9, 14 రోజులు ఇక్కడ నిద్రచేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
దొనలో దేవుడు
మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో జరిగే గట్టు మల్లన్న జాతర ప్రత్యేకమైనది. మల్లికార్జునుడి కమనీయ కల్యాణానికి, జాతరకు వేదికైన వేలాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. చుట్టూ పచ్చని పొలాలు.. పక్షుల కిలకిలరావాలు.. గోదారమ్మ గలగలల సమీపంలోనే ఎత్తయిన గుట్ట.. దాని చివరన ఉన్న దొనలో శివలింగం దర్శనమిస్తుంది. ముక్కంటి విగ్రహం చెంతనే నీటి చెలిమె ఉంది. అన్ని కాలాల్లోనూ దానిలో నీరుంటుంది. ఆ నీళ్లను భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. రంగురంగుల ముగ్గులతో ఆకర్షణీయంగా పట్నాలేసే పూజారుల కోలాహలంతో సందడిగా ఉంటుంది.
భక్తుల శివనామస్మరణతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంది. సుమారు 200 ఏండ్ల క్రితం వేలాల గ్రామంలో నరహరి పోగుల పుల్లయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు. ఆయన ఒకరోజు పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని గుట్టపైకి వెళ్లాడు. అక్కడ దొన (సొరంగం)లోంచి గట్టు మల్లన్న రోజూ బయటికి వచ్చి పుల్లయ్యతో కైలాస పటం ఆడేవాడట. కాలక్రమంలో పుల్లయ్య ఊళ్లోవాళ్లకు కనిపించకుండా పోయాడట. అందరూ ఆందోళన చెందుతుంటే.. మల్లన్న దేవుడు ఊరిపెద్ద కలలోకి వచ్చి ‘పుల్లయ్య నా దగ్గరే ఉన్నాడు. ఇకమీదట ఎవరు పిలిచినా పలుకుతాను’ అని చెప్పాడట. అప్పటినుంచి మల్లన్నను తమ బాగోగులు చూసుకునే దేవుడిగా భక్తులు భావిస్తున్నారు. ఏటా శివరాత్రికి జాతర నిర్వహించి బోనాలు సమర్పిస్తారు.
మూడురోజుల జాతర
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శివరాత్రికి భక్తజన సంద్రంగా మారిపోతుంది. ఇక్కడ ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడురోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో ఐదులక్షల మందికిపైగా భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. కోడెమొక్కుల రాజన్నను తమ ఇంటిదైవంగా, ఇంట్లో మనిషిగా భావిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అద్దాల మంటపంలో మహాలింగార్చన కార్యక్రమం జరుగుతుంది. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో రాజేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇక స్వామివారి కల్యాణం అంగరంగా వైభవంగా సాగుతుంది. శివరాత్రి మరుసటి రోజు బద్ది పోచమ్మ ఆలయంలో జాతర జరుగుతుంది. రాజన్నను దర్శించుకున్న భక్తులు బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుంచి డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా అందరూ బయల్దేరుతారు. ఈ ఘట్టం శివరాత్రి ఉత్సవానికి అదనపు వైభవాన్ని కలిగిస్తుంది.
మల్లన్న సన్నిధిలో
కోరమీసాల మల్లన్న కొలువుదీరిన కొమురవెల్లిలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పండుగ పర్వదినం సందర్భంగా పెద్దపట్నం వేసి స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా 111 పలకల వెడల్పుతో పంచరంగులతో పెద్దపట్నం వేస్తారు. దీనిని వేయడానికి దేవస్థానంతోపాటు ఇక్కడికి వచ్చే భక్తులు సైతం బండారు తెస్తారు. ఈ పట్నంలోనే కల్యాణం జరుగుతుంది. ఒగ్గు పూజారుల సంప్రదాయం ప్రకారం పాటలు పాడుతూ కల్యాణోత్సవం జరిపిస్తారు. దీనికి హజరైన భక్తులు ‘కోరమీసాల దేవుడికి కోటి దండాలు.. కొమురెల్లి మల్లన్నకు శతకోటి దండాలు..’ అని గొంతెత్తి పరవశిస్తారు. రాత్రంతా జాగారం చేస్తూ.. ఆటపాటల్లో మునిగితేలుతారు. మల్లన్న ఉన్నాడన్న ధైర్యంతో అగ్నిగుండాలు తొక్కుతూ భక్తిని చాటుకుంటారు. సంక్రాంతి తర్వాతి ఆదివారం మొదలైన కొమురవెల్లి సందడి మహాశివరాత్రి రాకతో మిన్నంటుతుంది. ఫాల్గుణ మాసం చివరి ఆదివారం వరకు పట్నం ఉత్సవాలు కొనసాగుతాయి.
సంక్రాంతి నుంచి ఉగాది వరకు..
శతాబ్దాల చరిత్ర ఉన్న శైవ క్షేత్రం ఐనవోలు సంక్రాంతి పండుగకు మొదలయ్యే మల్లన్న జాతర ఉగాది వరకు సాగుతుంది. భోగి, సంక్రాంతి సందర్భంగా లక్షలాది భక్తులు జాతరకు హాజరవుతారు. తర్వాత కూడా వారాంతాల్లో భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. శివరాత్రి సందర్భంగా జాతర జోరందుకుంటుంది. లక్షలాదిగా భక్తులు ఐనవోలు చేరుకుంటారు. మల్లన్నకు ఘనంగా బోనాలు సమర్పించి, పట్నం ముగ్గులు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.