- 18వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలకు సర్వం సిద్ధం
- ప్రదర్శన ప్రమాణాలను పెంచుతూ.. జనరంజకంగా నాటకోత్సవాల నిర్వహణ.

మీడియా పవర్, విశాఖపట్నం, 10 ఏప్రియల్ 2023 : విశాఖ పిఠాపురం కోలనీలో ఉన్న కళాభారతి (ఏ.సి) మరియు వి.ఎమ్.డి.ఎ ఆడిటోరియంలో నాటకోత్సవాల కమిటీ అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు నేడు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా కళాభారతి వేదికగా నాటక కళాపరిషత్ స్థాయిని ఉజ్వలంగా కొనసాగిస్తోందని సగర్వంగా తెలిపారు. అంతేకాకుండా సమయపాలన, క్రమశిక్షణాలకు పుట్టినిల్లుగా బాసిల్లుతూ, ప్రదర్శన ప్రమాణాలను పెంచుతూ.. జనరంజకంగా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అటు పరిషత్ నిర్వాహకులు ఇటు నాటక సమాజాలవారు ఉభయుల కృషికి తోడు మాన్యశ్రీ పైడా కృష్ణప్రసాద్ వంటి దాతల సహకారంతో నాటక కళలు నేటికీ బ్రతికున్నాయని తెలిపారు. సినిమా రంగం కంటే నాటక రంగంతో మేలు జరుగుతుందని, ఈ రంగం కేవలం వినోదంకోసమే కాదని అరిషడ్వర్గాల స్వరూప స్వభావాలను, వాటి స్వరూప స్వభావాలను రంగస్థలం మీద ఆవిష్కరింపజేసి ప్రేక్షకుల ఆలోచనలకు పదునుపెడతాయని తెలిపారు. తద్వారా సమాజానికి ఒక స్ఫూర్తిని మార్గదర్శక విలువలను అందజేస్తామని తెలిపారు. ఈ మహాయజ్ఞంలో ప్రేక్షక మహోదయులు తెలుగు నాటకరంగ అభివృద్ధిని కాంక్షించే కృషీవలురు, నాటక సమాజాలవారు అందరూ ఈ కార్యక్రంలో పాల్గొని విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ భవిష్యత్కార్యక్రమాలను దిగ్విజయం చేయాలనీ నాటక కళామతల్లికి నీరాజనాలు అందించాలని కోరారు.
ఇదే విధంగా 2023 ఏప్రియల్ 12, 13, 14, 15 మరియు 16 తేదీలలో నాకోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలాంటి ప్రాంతాలనుండి మొత్తం 43 ఎంట్రీలు ఈ ఏడాది వచ్చాయని వాటినన్నింటిని వినోదప్రదర్శన కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి నాలుగు రోజులు, రోజుకు రెండు నాటికలు, 16వ తేదీన ఒక నాటిక ప్రదర్శించబడుతుందని అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు.
డా॥ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు): వి.ఎమ్.డి.ఎ. ట్రస్టీ మరియు నాటకోత్సవాల ప్రధానకార్యదర్శి డా॥ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు) గారు మాట్లా డుతూ రైల్వే రాయితీ లేనందున సమాజాలవారి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని, ఈ పోటీలకు ఎంపికకాబడి, ప్రదర్శి ౦చే ప్రతి నాటికకు ప్రకటించిన పారితోషికానికి (రూ॥11,000/-) తోడు అదనంగా రూ॥ 2,000/- ఇవ్వటానికి నిర్ణయించినట్టు తెలిపారు. ప్రదర్శనరోజున స్థానికేతర సమాజాలముల వారికి భోజన ఖర్చులు మరియు నిమిత్తం రూ॥ 4000/- లతో పాటు ఉచితంగా వసతి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి అదనంగా ఉత్తమ పదర్శనకు రూ॥15,000/-లు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥12,000/-లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ|| 10 ,000/-లు, చతుర్థ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 7,500/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ఇవిగాక 12 వ్యక్తిగత బహుమతులు రూ॥ 1500/-లు మరియు జ్ఞాపికలు అందజేయబడుతాయని, మూడు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ప్రోత్సాహక బహుమతుల క్రింద నాటికలలో పాల్గోన్న ప్రతి బాల, నటీ నటులకు రూ॥ 500/- లు నగదుతో పాటు జ్ఞాపికలు బహూకరించబడతాయని, ఈ నాటకోత్సవాలలో అందరికీ ప్రవేశం ఉచితమని తెలియజేస్తూ, నాటక అభిమానులంతా అధిక సంఖ్యలో హాజరై, కళాభారతి - కీ॥శే॥ పైడా కౌషిక్ నాటకోత్సవములను విజయవంతం చేయాలని కోరారు.
పైడా కృష్ణప్రసాద్: నాటకోత్సవాల మహారాజపోషకులు శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ తెలుగు నేలమీద ప్రఖ్యాతి గాంచిన ఈ నాటకోత్సవాలకు పోషకులుగా వుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, ఈ నాటకోత్సవాల ద్వారా విశాఖపట్నం ఖ్యాతి నలుదిశలా రాజిల్లుతోందని, రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు.
డా|| కె.జి. వేణు: నాటకోత్సవాల చీఫ్ కన్వీనర్ డా|| కె.జి. వేణు మాట్లాడుతూ కళాభారతి వేదిక నాటకరంగ కళాకారులకు స్వర్గ- ధామంలాంటిదని, విశాఖలో నాటికల ప్రదర్శనలకోసం రెండు రాష్ట్రాలలోని నాటకసమాజాలు పోటీపడుతుంటాయని, నాటికల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు, నిర్వహణలో పాటిస్తున్న నియమాలను, కళాకారులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, నాటకోత్సవాలలో ఏర్పాటుచేస్తున్న మహాప్రాంగణకర్త దాదాసాహెబ్ పాల్కే పుస్కార గ్రహీత, సుప్రసిద్ధ సినీ దర్శకులు, నటులు పద్మశ్రీ స్వర్గీయ కాశీనాధుని విశ్వనాధ్ మరియు రోజువారి ప్రాంగణకర్తల వివరాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్ కన్వీనర్స్ శ్రీ బొడ్డేటి జగత్ రావు, శ్రీ వి. నాంచారయ్యలతో పాటు కార్యవర్గసభ్యులు,అనేక మంది ప్రముఖులు, నాటకభిమానులు పాల్గొన్నారు.