మీడియా పవర్, విశాఖపట్నం: రెడీమెడ్ రంగం విస్తరించడంతో టైలరింగ్‌కు గిరాకీ తగ్గి తమ పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖ టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం కూడలిలో ప్రపంచ టైలర్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టైలరింగ్ మెషిన్ సృష్టి కర్త ఐజాక్ మెరిట్ సింగర్ కు నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రేటర్ విశాఖ టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ యాదిగిరి రెడ్డి మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము ఎన్నిసార్లు అధికారులకు ప్రభుత్వానికి సామాజిక భవనం కోసం విన్నవించుకున్నా కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేసారు. తమ కనీస అవసరాలకోసం సామజిక భవనాన్నివెంటనే మంజూరు చేయాలని కోరారు. సంయుక్త కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇరవై మూడేళ్ల క్రితం స్థాపించిన తమ సొసైటీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిందని , ఈ సొసైటీలో సుమారు 150 షాపులకు చెందిన 1000 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. తామందరినీ ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహాయ సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు. గంటల తరబడి కుట్టుమిషన్‌పై కూర్చొని దుస్తులు కుట్టాల్సి రావడంతో టైలర్లకు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని గుర్తించాలని విన్నవించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాంప్రదాయ టైలర్లకు చేయూతనివ్వాలని డిమాండ్ చేసారు. వెంటనే తమ సొసైటీ సభ్యుల కనీస అవసరాల నిమిత్తం సామాజిక భవనాన్ని మంజూరుచేసి, ఇతర రంగాలకు ప్రభుత్వం చేస్తున్న రుణ పధకాలను తమకు వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సిహెచ్ వేణు, కోశాధికారి సిహెచ్ తిరుపతిరావు, సభ్యులు బి ఇషాక్, బాబా అధిక సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు.
Post a Comment
0Comments
3/related/default