విశాఖపట్నం,ఏప్రిల్,23: ఆదివారం జరిగిన చందనోత్సవం సందర్భంగా వరహా లక్ష్మీనరసింహ స్వామి వారి నిజ రూప దర్శనం 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఆదివారం సింహాచలం దేవాలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వారి నిజరూప దర్శనం కాంచి సంతృప్తి చెందారని వెల్లడించారు. చందనోత్సవాలకు విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్, దేవదాయ శాఖ కమీషనర్, జివిఎంసి కమిషనర్, తదితర అధికారులుతో నెలరోజుల క్రితమే చర్చించినట్లు పేర్కొన్నారు. ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వహించాలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, దేవదాయ శాఖలు మంచి ఏర్పాట్లు చేసారని హర్షం వ్యక్తం చేసారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసారని కితాబిచ్చారు. ఘాట్ రోడ్ లో ఒక వాహనం మరమ్మత్తులకు గురి కావడం వలన ట్రాఫిక్ రాక పోకలకు చిన్న పాటి అంతరాయం కలిగిందని, సెలవు దినాలు కావడంతో భక్తులు రద్దీ పెరిగిందన్నారు. రెండు, మూడు స్లాట్ లలో టిక్కెట్లు పొందిన భక్తులు ఒకేసారి దర్శనానికి రావడంతో రద్దీ ఏర్పడినట్లు వివరించారు.
ఏ సంవత్సరం చేయని విధంగా ఈ యేడాది ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు సంతృప్తికరంగా స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ సీర సత్యనారాయణ, చందనోత్సవాల ప్రత్యేక అధికారి ఆజాద్, ఆలయ ఈఓ త్రినాథ్ రావు, తదితరులు పాల్గొన్నారు.