మీడియా పవర్, విశాఖపట్నం: రహదారి భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమౌతుందని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం అన్నారు. ఈ మేరకు ఎంవిపీ కాలనీలో బుధవారం ఉదయం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నపిల్లలు వాహనాలు నడపరాదని హితవు పలికారు. రహదారి ప్రమాదాలు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ప్రపంచంలో మనం ఒక్కరం అన్న భావన సరైనదే కానీ మన కుటుంబానికి మాత్రం మనమే ప్రధానం అన్న విషయాన్ని వాహనాలు నడిపే వారంతా గుర్తుంచుకోవాలని కోరారు. ఉపాధ్యాయుని నీలిమ మాట్లాడుతూ ట్రాఫిక్ భద్రతా ప్రమాణాల మీద అందరికీ అవగాహన కల్పించడం చాలా అవసరం అన్నారు. ప్రధానంగా విద్యార్థులు అవగాహన పొందితే తమ కుటుంబానికి అవగాహన కల్పించడం సులభతరం అవుతుందన్నారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం చాలా మంచిది అన్నారు. అయితే వేసవి సెలవులు కావడంతో కొంత మంది విద్యార్థులు అందుబాటులో ఉంటారు కనీసం వారికైనా అవగాహన కల్పిస్తే చాలా ప్రమాదాలు నివారించిన వారు అవుతామని పేర్కొన్నారు.
అనంతరం సోషల్ వర్క్ విద్యార్థి, సి ఎస్ కే ఎన్జీవో అధ్యక్షుడు జి ధర్మారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన ఉండాలని పిలుపునిచ్చారు. జనసాంద్రత పెరుగుతున్న విశాఖ నగరంలో రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదాల నివారణకు యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు మాట్లాడారు.