-- ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను ఎందుకు దెబ్బతీస్తున్నావ్?
-- ప్రజలు త్యాగాలు చేస్తే యోగాలు భోగాలు నువ్వు అనుభవిస్తావా?
-- విస్సన్నపేట కుంభకోణంపై నువ్వు విసిరిన సవాలను స్వీకరిస్తున్నా
-- అరసెంటు భూమి ఆక్రమించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
-- లేకుంటే నీ కొడుకును రాజకీయాల నుంచి తప్పుకోమంటావా?

మీడియా పవర్, విశాఖపట్నం: రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయటమే కాకుండా రాష్ట్రం ప్రజల మీద,విశాఖ మహా నగరం మీద మీకెందుకు అంత పగ ? అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పదంలో నడుస్తున్న వైనం చూడలేని చంద్రబాబు నాయుడు పిచ్చిప్రేలాపనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడైనా చూసామా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో అనేక పోరాటాలు చేశారు. కానీ ఆయన ఎప్పుడూ రాష్ట్రాన్ని దాని ప్రయోజనాలను పనంగా పెట్టి రాజకీయాలు చేయలేదని అమర్నాథ్ గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని జనంతో చెప్పించే ప్రయత్నం చేశారని , దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడుకి విశాఖపట్నంపై ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ని ఎప్పుడూ పక్కన పెట్టలేదని, దానిని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అమరావతి ప్రజల మీద ప్రేమ లేదు. అభిమానం లేదు. గౌరవంలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్న రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతోందో అన్న భయంతో జనాన్ని రెచ్చగొడుతున్నారని అమర్నాథ్ తెలిపారు. ప్రజలు త్యాగాలు చేస్తే యోగాలు, భోగాలు అనుభవించే చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రంలోని పేదలకు 2 లక్షల పదివేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని ఇవన్నీ కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రమంతా తిరుగుతూ మీటింగులు పెడుతున్న చంద్రబాబు నాయుడు 2024లో ఏం చేస్తాడో చెప్పకుండా పోతున్నాడని, ఆయనకు మేనిఫెస్టో మీద నమ్మకం లేదని మరోసారి నిరూపించుకున్నాడని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు తన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకోలేక, ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని మంత్రి అమర్నాథ్ నిలదీశారు. చంద్రబాబు తనకు ముందు చూపు ఉందని నిన్న సభలో చెప్తుంటే విన్నాను. అది నేను ఖండిస్తున్నాను ఆయనకున్నది వెనక చూపు మాత్రమే. ఆ చూపుతోనే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడని ఎద్దేవాచేసారు మంత్రి అమర్నాథ్. తమ ప్రభుత్వంలో పేదలకు ఇస్తున్న భూములు గురించి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికైనా ఒక సెంటు భూమైన పంచి పెట్టావా చంద్రబాబు ? అని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల మందికి భూమి పంపిణీ చేయడమే కాకుండా ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తోందని, సొంత స్థలాలలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వారికి కూడా ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తోందని, చెవులు ఉండి వినలేని కళ్ళుండీ చూడలేని పరిస్థితిలో వున్న మిమ్మల్ని చూస్తుంటే ప్రజలు జాలిపడడం తప్ప ఓటు మాత్రం వేయరని జోస్యం చెప్పారు. ఈ చంద్రబాబుకు మా నాయకుడు ప్రజల అభిమాన ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచి పనులు ఎలా కనిపిస్తాయని, లబ్ధిదారుల సంతృప్తికరమైన మాటలు ఆయనకు ఎలా వినిపిస్తాయని? అమర్నాథ్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలను సమాధులుగా వర్ణిస్తున్న చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికల్లో లబ్ధిదారులే తగిన సమాధానం చెప్తారని అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ పరిధిలో 1,50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తే, చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ కార్యక్రమానికి అడ్డు తగిలాడని.. ఇది పేదలపై ఆయనకున్న అభిమానానికి నిదర్శమని పాత్రికేయుల సమావేశంలో అమర్నాథ్ అన్నారు.
ఇదిలా ఉండగా "విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కబ్జా చేశానని చంద్రబాబు నాయుడు నాపై విమర్శ చేయడం అత్యంత విడ్డురమని అంతేకాకుండా ఆ కబ్జాని నిరూపిస్తారని కూడా సవాలు విసరడం అయన పదవీకాంక్షకు పరాకాష్ట అని అన్నారు. అయితే ఆ సవాలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపిన అయన అందులో అర సెంట్ భూమి నైనా నేను కానీ.. నా కుటుంబ సభ్యులు కానీ ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని తెలిపారు. నిరూపించకపోతే లోకేష్ ను రాజకీయాల నుంచి తప్పిస్తావా?" అని చంద్రబాబుకు మంత్రి అమర్నాథ్ ప్రతి సవాలు విసిరారు. తప్పు చేయాల్సి వస్తే.. తన పీక తీసి పక్కన పెట్టుకుంటానే తప్ప, నీలాంటి అవినీతిపరుడుతో మాటలు అనిపించుకోనని చంద్రబాబుకు అమర్నాథ్ స్పష్టం చేశారు. మైకు పట్టుకోడానికి ఓపిక లేని చంద్రబాబుకు ఇంకా రాజకీయాలు ఎందుకు? అని ఎద్దేవాచేసారు. చంద్రబాబు తనకు రాజకీయ ఓనమాలు నేర్పానని చెప్పుకోవడం తనను విస్మయానికి గురి చేసిందని అమర్నాథ్ అన్నారు. తన తాత, తండ్రి విలువైన రాజకీయాలు చేశారని, వారి వంశం నుంచి వచ్చిన మూడోతరం నాయకుడినని, నీ కొడుకు లాగా దొడ్డి దారిన వచ్చిన మంత్రిని కానని అమర్నాథ్ స్పష్టం చేశారు.
నోట్ల రద్దు గురించి చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన మాటలు చెబుతూ సభలో కామెడీ చేశారని, సభ ముగిసిన తర్వాత బాబు చేసిన కామెడీ గురించి జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారని అమర్నాథ్ అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేత గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడుకి అర్హత లేదని, ఆయన హయాంలోనే షుగర్ ఫ్యాక్టరీలకు తాళాలు వేశాడని అమర్నాథ్ తెలియజేశారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ లో క్రషింగ్ కి అవసరమైన చెరుకు లభ్యత లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి దాని స్థానే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వర్లించినట్లు ఉన్నాయని, అతని హయాంలో భారీగా విద్యుత్ చార్జీలు పెంచి, ప్రశ్నించిన వారిని తుపాకీలతో కాల్చి చంపిన ఘటనను ఆయన మర్చిపోయినా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదని అమర్నాథ్ మరోసారి గుర్తుచేశారు.
రాష్ట్రంలో తన హవా తగ్గుతోందని గమనించిన చంద్రబాబు ఎన్టీఆర్ ను మళ్ళీ తెరమీదకు తీసుకు వస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దెయ్యాలన్నీ అతనికి శతజయంతి ఉత్సవాలు నిర్వహించటం అత్యంత బాధాకరంగా ఉందని అన్నారు. ఎన్డీఏ కన్వీనర్ గా కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ సమయంలో ఎన్టీఆర్ కి ఎందుకు భారతరత్న ఇప్పించలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా? అని ప్రశ్నించారు మంత్రి.