• వస్త్ర వ్యాపారం కోసం ఒప్పందం .....
• వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన
మీడియా పవర్, విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఆశీలుమెట్ట ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న బలబద్ర వెంకట కుమార్ అనే వస్త్ర వ్యాపారితో 6నెలల వ్యవధితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు మధ్యలో తనను వేధిస్తున్నారని విజయనగరానికి చెందిన లెంక లీలా భారతి మీడియా ముందు ఆవేదన చెందారు.
వివరాల్లోకి వెళ్తే .....
విజయనగరానికి చెందిన లెంక లీలా భారతి విశాఖ నగరంలో ఆశీలుమెట్ట వద్ద ఉన్న ప్రముఖ వస్త్ర దుకాణం యజమాని బలబద్ర వెంకట కుమార్ తో 2023మార్చి 23న ఎంఒయూ చేరేసుకున్నట్టు తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ లో అపార అనుభవం వున్నా అమె వస్త్రాలు కుమార్ దుకాణంలో అమ్ముటకు అనుమతినిస్తూ ( షాప్ అద్దె, కరెంటు, సాధారణ ఖర్చుల నిమిత్తం 20% అమ్మకాల్లో ఆమె చెల్లించేందుకు ) ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. జిఎస్టి అనుమతి లేనందున కుమార్ తో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీన వ్యాపార నిమిత్తం అహ్మదాబాద్, సూరత్ ప్రాంతాలకు వెళ్ళగా ఆ సమయంలో సుమారు 60,000 వ్యాపారం లావాదేవీలు జరిపామని దీనికి సంబంధించి 50 వేల రూపాయలు కుమార్ తనకు బ్యాంకు ద్వారా పంపించారని లీలా భారతి తెలిపారు. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం 20 శాతం మాత్రమే ఆయన తీసుకోవాలని కానీ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ 32% తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే విషయాన్ని ప్రశ్నించినందుకు తనపై వేధింపులు ప్రారంభించారని ఆమె చేసుకున్న ఒప్పందం చెల్లదని బెదిరిస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన పై వేధింపులలో భాగంగా ఏప్రిల్ 19న షాపులో ఉంచిన నాలుగు లక్షల రూపాయల విలువైన ముడిసరుకు, 18 లక్షల విలువైన సరుకును దొంగిలించారని ఆరోపించారు. దీనిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసానని, ఇప్పటి వరకు విచారణ జరపకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని తెలిపారు. దీనిపై మే 8వ తేదీన నగర పోలీస్ కమిషనర్ కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయగా ఇది సివిల్ కేసు అయినందున కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారని తెలిపారు. ఈ క్రమంలో మే 9వ తేదిన ఆమె వస్త్ర దుకాణం మూసివేసి వెళ్లిపోయానని, మరుసటి రోజు దుకాణం తెరిచిన తనకు షాపులో ఉన్న మరొ 4 లక్షల విలువైన ముడిసరుకు, 15 లక్షల విలువైన సరుకు కనపడక పోవడంతో ఇదే విషయాన్ని మే 10వ తేదీన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ముఖ్యమంత్రి పర్యటన అనంతరం విచారణ చేపడతామని పోలీసులు చెప్పారని ఆమె తెలిపారు. అంతే కాకుండా తనను షాపులో వ్యాపారం చేయనీయకుండా షాప్ నుండి బలవంతంగా బయటకు పంపేందుకు కుమార్ ప్రయత్నిస్తున్నాడని అతని నుండి తనకు ప్రాణహాని ఉందని దీనిపై పోలీసులు వెంటనే విచారణ చేపట్టి తనకు తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు.