వాల్తేరు డివిజన్లో రైల్వే అనుసంధానం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఎంపీ జీవీఎల్ హామీ
రైల్వే జోనల్ సంప్రదింపుల మండలి సభ్యులుగా ఈ ప్రాంతం నుంచి ఐదుగురు లోక్ సభ, ముగ్గురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేస్తారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు డివిజన్ లో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపీ జీవీఎల్ నరసింహారావును రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేశారు.
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంత రైల్వే వినియోగదారుల ప్రయోజనాల కోసం పోరాడడమే కాకుండా, సికింద్రాబాద్-విజయవాడ మధ్య మాత్రమే నడుపుతున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ను విశాఖకు వరకు పొడిగించడంలో ఎంపీ జీవీఎల్ ప్రధాన భూమిక పోషించారన్నది జగమెరిగిన సత్యం. గంగా పుష్కరాలు, వేసవి సీజన్ కోసం విశాఖ, గుంటూరు నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను మంజూరు చేయడంలో కూడా ఎంపీ జీవీఎల్ ప్రధాన పాత్ర పోషించారు. విశాఖలో ప్రధాన కార్యాలయంతో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను త్వరగా ఏర్పాటు చేయాల్సిన అవసరం, విశాఖ రైల్వేస్టేషన్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వారణాసి, లక్నో, అయోధ్య, ప్రయాగ్ రాజ్ లకు రెగ్యులర్ రైళ్లు, విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రైలును ప్రారంభించడం వంటి అంశాలను ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో లేవనెత్తిన విషయం "మీడియా పవర్" పాఠకులకు విదితమే.
నామినేషన్ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రైల్వే అనుసంధానం మెరుగుపర్చడం, ప్రయాణీకులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించడం, వాల్తేరు డివిజన్లో మెరుగైన ప్యాసింజర్, కార్గో రవాణాకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
వాల్తేరు డివిజన్లోని రైల్వే ఉద్యోగ సంఘాలు, మెరుగైన రైలు సేవల కోసం కృషి చేస్తున్న క్రియాశీల పౌర సమాజ సభ్యులు, పరిశ్రమ ప్రతినిధులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.