- నీరాజనం పట్టిన అభిమాన జనం .....
- కోలాహలంగా మారిన కళా భారతి ప్రాంగణం
- సనాతన ధర్మమే జీవన వేదం
మీడియా పవర్, విశాఖపట్నం: భారతీయ సనాతన ధర్మంలో సంస్కృతి సంప్రదాయాలలో భాగం పంచుకున్న సంగీత, సాహిత్య నృత్య కళలు మన జీవన వేదంగా బాసిల్లుతున్నాయని వాటిని మరుగునపడకుండా కాపాడటంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, కళాభారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు నిలువుటద్దంగా నిలుస్తున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. 37వ జాతీయ సంగీత, నాటకోత్సవాలను విశాఖ పిఠాపురం కాలనీలో ఉన్నకళాభారతి సభా మందిరంలో శనివారం ఆయన ప్రారంభించారు. సంస్థ 37 వ వసంతంలో అడుగు పెడుతున్న శుభతరుణంలో ప్రఖ్యాతి గాంచిన సంగీత కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అత్యంత ఆనందదాయకమని అన్నారు. కళల ఆదరణతో విశ్వ గురువుగా మన దేశం భాసిల్లుతోందని తెలిపిన ఆయన సంగీతం, నృత్యం, సంస్కృతిని భావితరాలకు అందించి వాటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా తల్లి తండ్రులు హిందూస్థానీ, కర్ణాటక సంగీతాల్లో నేటి తరాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసుడు పద్మశ్రీ అన్నవరపు రామస్వామికి నాద విద్యాభారతి పురస్కారం వెంకయ్యనాయుడు ప్రదానం చేసారు. జాతీయ పురస్కార బహుమతి గా లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం నూతన వస్త్రాలు, వాటితోపాటు రూ. 2 లక్షలు విలువ చేసే స్వర్ణ కమలం, ప్రతిష్టాత్మకమైన "నాద విద్యా భారతి" బిరుదు తో అపర త్యాగరాజు పద్మశ్రీ, డాక్టర్ అన్నవరపు రామస్వామిని సత్కరించిన వారిలో వైస్ అడ్మిరల్ జి.శ్రీనివాసన్. వీఎండీఏ అధ్యక్షుడు సత్యనారాయణరాజు, కార్యదర్శి వీఆర్ కే రాంబాబు అందచేసిన వారిలో వున్నారు. అనంతరం పురస్కార గ్రహీత అన్నవరపు మాట్లాడుతూ కర్ణాటక సంగీతానికి అంత ఆదరణ లభించడానికి ప్రదాన కారణం తెలుగు భాషాకావడం విశేషమన్నారు.