అధికారం కోసం... సానుభూతి పర్వం...

MEDIA POWER
0


రాజకీయాల్లో హింసకు తావులేదు... ఇది మన నాయకులు అందరూ చెప్పే మాట... కానీ వాస్తవంలో జరిగేది వేరు... గత ఎన్నికల్లో ఒక హత్యా ప్రయత్నం, మరొక హత్య ప్రధాన పాత్ర వహించాయన్నది కాదనలేని నిజం... వాటి వలన ప్రజల్లో పెల్లుబికిన సానుభూతి ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో కనపడింది... వాటిని తెలివిగా ప్రత్యర్థుల పైకి నెట్టేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం వరకూ బాగానే వుంది... మరి అధికారంలోకి వచ్చాక జరిగిందేమిటి... ముందుగా విచారణను తమ ఆధీనంలో ఉంచుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు....అది కుదరకపోవడంతో ఎవరి మరణాన్ని అప్పుడు ఎన్నికల్లో వాడుకున్నారో, వారినే స్త్రీలోలుడుగా చూపించే ప్రయత్నం గట్టిగా చేశారు. ఆయన కుమార్తె చేస్తున్న న్యాయ పోరాటానికి  ఇప్పటికి అడ్డంకులు సృష్టిస్తూనే వున్నారు.  ఆమెను తమ వందిమాగధులచే నానా దుర్భాషలు ఆడిస్తున్నారు.. అయిదేళ్ల పాలనలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి సోదరుడి హత్య ఉదంతంలో నేరస్తులను పట్టుకోలేక పోవడం అంటే... వ్యవస్థల దుస్థితి అర్థం అవుతోంది... ఆఖరుకి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెళ్ళు కొంగు జాపి మాకు న్యాయం చేయండని బహిరంగంగా ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి చూశాక ఇంక రాష్ట్రంలో పాలన గురించి చెప్పడానికి ఏముంది... ఎవరి మీద ఎవరు దాడి చేసినా అది సమర్ధనీయం కాదు... ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మీద జరిగిన రాయి దాడి ఖండించ వలసిందే... కానీ ఆయన ఒక్కరిపై దాడి జరిగితేనే అన్యాయమా... రాష్ట్రంలో మిగిలిన వాళ్ళు మనుష్యులు కాదా... ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద అధికార పార్టీ కార్యకర్తలు రాళ్ళతో దాడి చేసినప్పుడు మాత్రం భావ ప్రకటనా స్వేచ్ఛ అని అనడం మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుతుంది... గడచిన అయిదేళ్లలో ఎంత మంది సామాన్యులు అధికార పార్టీ నాయకుల హింసా ప్రవృత్తికి బలయ్యారో, ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో చూశాం... ఇక ప్రభుత్వ హింస గురించి చెప్పాలంటే సాక్షాత్తూ ఒక పార్లమెంట్ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేసి, విపరీతంగా కొట్టారని ఆయనే కోర్టులో బావురుమనడం అందరికీ తెలిసిందే.... ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, హింసించడం లాంటి ఘటనలు కోకొల్లలు... అలాగని ఇప్పుడు జరిగిన రాయి దాడిని సమర్ధించకూడదు... కాకపోతే ఇది నిజంగా జరిగినదా లేక గతంలో జరిగిన వాటిలాగే ఇది కూడా సానుభూతి కోసం సృష్టించినదా అన్నదే అనుమానాస్పదం... గతంలో ప్రతిపక్ష నాయకుడి పై రాయి దాడి జరిగితే కొద్దిలో తప్పి పక్కనే వున్న సెక్యూరిటీకి గాయమైంది... అప్పుడు కనీసం ఆ గాయం గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు సరికదా పైపెచ్చు కొంతమంది అధికార పక్ష నాయకులు మీడియా ముందుకు వచ్చి అత్యుత్సాహంతో ఇష్టానుసారం మాట్లాడారు... రాయితో కొడితే చచ్చిపోడానికి ఆయనేమైనా పావురమా అని ఒకరు, ఆయన మీద కోపం ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక రాయి విసిరి వుండొచ్చు... దానికే ఇంత హడావిడి దేనికి అని ఇలా నోటికి  ఏదొస్తే అది మాట్లాడారు... కానీ తమ నాయకుడి మీద జరిగితే మాత్రం అది రాష్ట్రం మీద దాడి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు... ప్రాణం అందరిదీ ఒకటే... సాక్షాత్తూ హత్యానేరాల్లో ముద్దాయిలను వెనకేసుకు వస్తూ, సొంత కుటుంబ సభ్యులు న్యాయం కోసం రోడ్లెక్కినా పట్టించుకోకపోవడం ద్వారా నాయకులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు... మళ్ళీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం ... జరిగిన రాయి దాడిని ప్రత్యర్థుల మీదకి తోసి, మరొక సారి ప్రజలను మాయ చేసే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోంది... కొంతమందిని చాలా కాలం, చాలా మందిని కొంత కాలం మోసం చేయగలం... కానీ అందరినీ అన్ని వేళలా మోసం చేయలేం కదా... ప్రజలు వివేకవంతులు... గత సారి ఎన్నికల ముందు జరిగిన డ్రామాలను ఇంకా మర్చిపోలేదు గనక... మొదటిసారి మోసపోతే అది అవతలి వారి గొప్పతనం... రెండవసారి మోసపోతే అది మన చేతగానితనం... ఈసారి ప్రజలంతా ప్రతీ విషయాన్ని నిశితంగా పరిశీలించి, విజ్ఞతతో ఓట్లు వేస్తారని, వేయాలని కోరుకోవడం అత్యాశ కాదు కదా...  

                                               సూర్య శ్రీనివాస్ ముసునూరి ... మీడియా పవర్ పరిశీలనాత్మక కదనం 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">