వైసీపీని వీడి టిడిపిలోకి వలసలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గంటా
విశాఖపట్నం, ఏప్రిల్ 24: పద్మనాభం మండలంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పేరు ప్రకటించిన తర్వాత గ్రామాలకు గ్రామాలు వైసీపీని వీడి టిడిపి కండువాలు కప్పుకుంటున్నాయి. ఇప్పటికే అనేకమంది వైసీపీ ముఖ్య నాయకులు టిడిపిలోకి వచ్చేస్తుందడంతో ఆ పార్టీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు. తాజాగా కృష్ణాపురం సర్పంచ్ మొకర భవాని బుధవారం టిడిపిలో చేరారు. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎం.వి.పి. కాలనీలోని తన నివాసంలో ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ టిడిపి క్రమశిక్షణ గల పార్టీ అని, కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రమంతా భీమిలి వైపు చూసేలా భారీ మెజారిటీ తీసుకురావాలని కోరారు.
సర్పంచ్ భవాని సహా జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు మొకర అప్పలనాయుడు (అన్నమయ్య), సీనియర్ నేత మొకర శ్రీనులు కూడా వైసీపీని వీడి గంటా సమక్షంలో టిడిపిలో చేరారు. వీరంతా ఆ పార్టీని వదిలి వచ్చేయడంతో కృష్ణాపురంలో వైసీపీ తుడిచి పెట్టుకుపోయినట్టయ్యింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కాళ్ల నగేష్ కుమార్, డి.గోపీబాబు, మాజీ సర్పంచ్ ఎస్.ఆచ్చినాయుడు, మాజీ ఎం.పి.టి.సి. బొడ్డు శ్రీను, కొవ్వాడ సర్పంచ్ కోన శ్రీనివాస్, మండల తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల సత్యన్నారాయణ, సీనియర్ నాయకుడు ఎస్.పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు.