25 ఏళ్లకే ఎమ్మెల్యే కావడానికి ఎన్టీఆరే కారణమని ఏసీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
గుంటూరు: తాను 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యేవిధంగా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం గుంటూరులోని ఎన్టీఆర్ కల్చరల్ అసోషియేషన్ 55 వసంతాల వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ‘‘ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతోమంది విమర్శించారు. కానీ, ఆయన రాజకీయాల్లో రాణిస్తారని 25ఏళ్ల వయసులోనే నమ్మిన వ్యక్తిని నేను. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. చిన్న వయసులోనే మంత్రిని అయ్యే అవకాశమిచ్చారు. కుటుంబ విలువలు చాటి చెబుతూ అనేక సినిమాలు తీశారు. మహిళలంటే ఆయనకు ఎంతో గౌరవం. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన మహోన్నత నాయకుడు.
వరకట్నం, ఉమ్మడి కుటుంబం, లవకుశ లాంటి చక్కటి చిత్రాలతో మెప్పించారు. రకరకాల పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూశాం. అశ్వనీదత్ రామారావుగారిని విభిన్న పాత్రల్లో చూపించారు. ‘ఎదురులేని మనిషి’ సినిమా తీసి మంచి విజయం సొంతం చేసుకున్నారు. యుగపురుషుడు అనే టైటిల్‌తో సినిమా తీశారు. నిజంగా ఎన్టీఆర్ యుగపురుషుడు. రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, ధుర్యోధనుడు ఇలా ఎన్నో విభిన్న పాత్రలు వేసి ప్రజలను మెప్పించారు. ప్రపంచంలో ఇన్ని రకాల పాత్రలు వేసి మెప్పించిన వారు వుండరు. దివిసీమ తుపాను వచ్చినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ముందుకొచ్చారు. ఈ తరం వారికి ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి.
అనంతరం ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే జాతీయవాదం, తెలుగు, రసస్ఫూర్తి కలయిక. ఆయనకు దైవ భక్తి ఎంత ఉందొ దేశ భక్తి అంతకంటే ఎక్కువే ఉంది. పాలకుడిగా పథకాలకు తెలుగుపేరు పెట్టిన గొప్ప వ్యక్తి. ఎన్టీఆర్ లాంటి నటుడిని మనం చూడలేం. ఎలాంటి పాత్రలోనైనా రసస్ఫూర్తిని ప్రదర్శించిన ఏకైక నటుడు’’ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్, దర్శకులు వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.